వైయస్ రౌడీలా వ్యవహరిస్తున్నారు: బాబు
హైదరాబాద్: శాసనసభలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రౌడీలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. స్పీకరును కూడా ముఖ్యమంత్రి బెదిరిస్తున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిదులతో అన్నారు. శాసనసభ చరిత్రలో ఈ రోజు దుర్దినమని ఆయన అభిప్రాయపడ్డారు. శాసనసభలో చర్చకు తావు లేకుండా చేస్తున్నారని, తాము పట్ట పడితే శాసనసభను వాయిదా వేయడమో, తమను సస్పెండ్ చేయడమో, తాము చెప్పాలనుకున్నది చెప్పి వెళ్లిపోవడమో అదికార పక్షం చేస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసే బెదిరింపులకు భయపడేది లేదని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల తీరుపై తెలుగుదేశం పార్టీ గురువారం ఒక ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది. దీన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఇది ప్రారంభం మాత్రమేనని, ప్రతి జిల్లాలోనూ ఇటువంటి ప్రదర్శనలు పెడతామని చంద్రబాబు చెప్పారు. తాము సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, అక్రమాలను మాత్రమే వ్యతిరేకమని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులే కాంట్రాక్టులు తీసుకున్నారని, ఇందులో ముఖ్యమంత్రి కార్యాలయం పాత్ర కూడా ఉందని, తీవ్రమైన అవినీతి చోటు చేసుకుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications