మందకృష్ణ ఆమరణ దీక్ష విరమణ
హైదరాబాద్: వికలాంగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి శాసనసభలో ప్రకటన చేయడంతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ తన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. గత మూడు రోజులుగా ఆయన హైదరాబాదులోని ఆబిడ్స్ లో ఒక భవంతిలో దీక్ష కొనసాగిస్తున్నారు. మందకృష్ణ ఆరోగ్యంతో సహా ఆయనతో పాటు దీక్ష చేస్తున్న 22 మంది వికలాంగుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తిన్నది. గురువారం ఉదయం మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు మందకృష్ణ దీక్షా స్థలికి వెళ్లనీయలేదు. మందకృష్ణకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఆందోళనకు దిగారు. నల్లగొండలో ముగ్గురు వికలాంగులు సెల్ టవర్ ఎక్కి దూకుతామని బెదిరించారు. శాసనసభ్యుడు దారా సాంబయ్య, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి గురువారం ఉదయం మందకృష్ణతో చర్చలు జరిపారు.
మందకృష్ణ డిమాండ్లను అంగీకరించడానికి సాంకేతికపరమైన అడ్డంకులున్నాయని, ఈ సాయంత్రంలోగా దీక్ష విరమిస్తారని చెప్పారు. వికలాంగుల 33 డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని మల్లు రవి హామీ ఇచ్చారు. వికలాంగుల వికలత్వం స్థాయిని బట్టి పింఛను ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వికలాంగులకు గతంలో 200 రూపాయలు కాకుండా 500, 600, 700 రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అదే విధంగా వికలాంగుల డిమాండ్లపై మంత్రులతో కమిటీ వేసి నెల రోజుల్లోగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీంతో మందకృష్ణ మాదిగ దీక్ష విరమించారు. పింఛనును మరింత పెంచేలా ఆందోళనను చేపడతామని ఆయన చెప్పారు. తమ తదుపరి ఉద్యమం ఎస్సీ వర్గీకరణపైనే ఉంటుందని ఆయన చెప్పారు. ఉషా మెహ్రా కమిటీ నివేదికను ఈ నెల 20వ తేదీ లోగా సభలో పెట్టకపోతే 21వ తేదీ నుంచి ఆందోళన చేస్తామని ఆయన చెప్పారు. దీన్ని వికలాంగుల విజయంగా మందకృష్ణ మాదిగ అభివర్ణించారు.












Click it and Unblock the Notifications