వీసాల స్కామ్: హైదరాబాదులో దర్యాప్తు
హైదరాబాద్: నకిలీ వీసాల కుంభకోణం దర్యాప్తునకు చెన్నై నుంచి ఒక ప్రత్యేక పోలీసు బృందం హైదరాబాదు చేరుకుంది. మరో బృందం బెంగూళూర్ వెళ్లింది. ఆశాషైనీతో పాటు అమెరికాకు వెళ్లడానికి ప్రయత్నించిన స్త్రీ శ్రీలత హైదరాబాదు నివాసి. వెంకటరెడ్డి అనే దళారీ ఆశా షైనీతో పాటు మేకప్ ఉమన్ గా అమెరికాకు పంపేందుకు శ్రీలతతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇందుకు శ్రీలత నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుందని ప్రచారం జరుగుతోంది. మేకప్ కు సంబంధించిన విషయాలేమీ తెలియకపోవడంతో, ఆశాషైనీకి శ్రీలతతో పెద్దగా పరిచయం లేకపోవడంతో అధికారుల ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేక తడబడ్డారు. దీంతో అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ వీసాల కుంభకోణంలో దాదాపు 200 మంది తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక బడా నిర్మాతతో పాటు ఒక హాస్యనటుడికి ఈ కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. చెన్నైలోని అమెరికన్ కాన్సులేట్ అధికారులు నకిలీ కుంభకోణంలో ఉన్నవారి పేర్లను వెల్లడించడం లేదు. మొత్తం మీద ఆశాషైనీ ఉదంతంతో నకిలీ వీసాల డొంకంతా కదిలింది.












Click it and Unblock the Notifications