దేవేందర్ సహా టిడిపి ఎమ్మెల్యేల అరెస్టు
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన తెలుగుదేశం శాసనసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విమానాశ్రయాన్ని శుక్రవారం సాయంత్రం యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రారంభిస్తున్నారు. తెలుగుదేశం సీనియర్ నేత దేవేందర్‌గౌడ్‌తో సహా ఇతర శాసనసభ్యులను, కార్యకర్తలను ఈ సందర్భంగా రాజేంద్రనగర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని రాయదుర్గం పోలీసు స్టేషన్ కు తరలించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ టెర్మినల్ కు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న తమ డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించకపోవడంతో టీడీపీ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.
శుక్రవారం శాసనసభా సమావేశాలు వాయిదా పడగానే తెలుగుదేశం సభ్యులు శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు. అయితే ఇక్కడ భద్రతా కారణాల దృష్ట్యా 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో పోలీసులు టీడీపీ నేతలను అరెస్టు చేశారు. కాలినడకన వారు విమానాశ్రయం చేరుకోవడానికి ప్రయత్నించారు. తాము అధికారంలో వచ్చిన వెంటనే విమానాశ్రయం పేరు మార్చేస్తామని దేవేందర్ గౌడ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. అంతకు ముందు శాసనసభలో విమానాశ్రయం పేరుపై దేవేందర్ గౌడ్ కు, శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్యకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.












Click it and Unblock the Notifications