పొత్తులపై కొలిక్కి రాని లెఫ్ట్ చర్చలు
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో పొత్తుపై సిపిఐ, సిపిఎంల మధ్య ఆదివారంనాడు జరిగిన చర్చలు ఒక కొలిక్కి రాలేదు. తిరిగి ఈ నెల 27వ తేదీన సమావేశం కావాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు నిర్ణయించుకున్నారు. చర్చల్లో సిపిఎం తరఫున బి.వి. రాఘవులు, రామనర్సింహారావు, సిపిఐ తరఫున కె. నారాయణ, రామకృష్ణ పాల్గొన్నారు. ఉప ఎన్నికల్లో తాము పోటీ చేసే స్థానాలపై, పొత్తుల కోసం ఇతర పార్టీలు చేసిన ప్రతిపాదనలపై ఇరు పార్టీల నాయకులు చర్చించారు. ఈ నెల 22వ తేదీన సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశం, ఈ నెల 25, 26 తేదీల్లో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశం జరుగుతాయి. ఈ సమావేశాల్లో ఈ పార్టీలు విడివిడిగా ఉప ఎన్నికలపై నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ తర్వాత 27వ తేదీన ఈ రెండు పార్టీల నాయకులు సమావేశమై ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటాయి.
ఈ ఎన్నికలు ప్రజలు కోరుకున్నవి కావని, ప్రజలపై ఈ ఎన్నికలను రుద్దుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. ఈ ఉప ఎన్నికల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని, రాష్ట్ర రాజకీయాల విషయంలో నిర్ణయాత్మక పాత్ర వహించేవి కూడా కావని ఆయన అన్నారు. అయిష్టంగానే తాము ఈ ఎన్నికలకు సిద్ధమవుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు, లోకసభ్యులు రాజీనామాలు చేయడం వల్ల ఈ ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష తీవ్రతను నిరూపించడానికి తెరాస ఈ ఉప ఎన్నికలకు సిద్ధపడింది.












Click it and Unblock the Notifications