బాబు జన్మదినం: రోజా సందడి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా తెలుగు మహిళ అధ్యక్షురాలు, సినీ నటి రోజా సందడి చెప్పనలవి కాకుండా ఉంది. తిరుపతిలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుచనాపల్లి అమ్మవారి గుడిలో, రేణుకమ్మవారి గుడిలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. లక్ష రూపాయల విరాళం కూడా ప్రకటించారు. చంద్రబాబు కుటుంబం ఆరోగ్యైశ్వర్యాలతో తులతూగాలని, చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని కోరుకున్నట్లు రోజా చెప్పారు.
రాష్ట్రమంతటా చంద్రబాబు జన్మదినం వేడుకలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వహించారు. హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబును కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. హరికృష్ట తదితర తెలుగుదేశం నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. చంద్రబాబు రేపటి నుంచి మీ కోసం యాత్రను ప్రారంభించడానికి తిరుపతి బయలుదేరి వెళ్లారు. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని నారావారి పల్లె బయలుదేరి వెళ్తారు. అక్కడ ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటారు. తన 30 యేళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు తన సొంత గ్రామంలో జన్మదినం జరుపుకోవడం ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications