అమెరికాలో ఆంధ్రా విద్యార్థికి స్వేచ్ఛ
హైదరాబాద్: అమెరికాలోని ఫెల్ప్స్ కౌంటీ జైలులో గత 14 నెలలుగా మగ్గుతున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థికి విముక్తి లభించనుంది. సంచీని ఊపుతూ తన వద్ద బాంబు, ఆంత్రాక్స్ ఉన్నాయని అరుస్తూ మిస్సోరీ రొల్లా విశ్వవిద్యాలయంలో నిరుడు ఫిబ్రవరి 27వ తేదీన గందరగోళం సృష్టించిన ఆంధ్రా విద్యార్థి సుజిత్ జైలు పాలయ్యాడు. అతని వద్ద పేలుడు పదార్థాలు గానీ బాంబులు గానీ లభించలేదు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈ సుజిత్ వెంకట్ రామోల్లాపై అమెరికా పోలీసులు ఆరు అభియోగాలను మోపారు.
కొన్ని ఆరోపణలను పోలీసులు ఉపసంహరించుకున్నందున జూన్ లో సుజిత్ జైలు నుంచి విడుదల కానున్నట్లు చికాగోలోని భారత కాన్సులేట్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. హైదరాబాదులోని దక్కన్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి స్వర్ణ పతకం అందుకున్న మిస్సోరీ - రొల్లా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ కోర్సు చేయడానికి 2006లో అమెరికా వెళ్లాడు. సుజిత్ ఎనిమిదో తరగతి చదువుతున్న కాలంలోనే తండ్రి మరణించాడు. దీంతో కుటుంబ భారమంతా సుజిత్ సోదరుడు భువిత్ తనపై వేసుకున్నాడు. భువిత్ సుజిత్ కన్నా రెండేళ్లే పెద్ద. సుజిత్ ను అమెరికా పంపించడానికి కుటుంబ ఎన్నో త్యాగాలు చేసింది. డబ్బులు అప్పు తెచ్చింది.
అమెరికా వెళ్లినా సుజిత్ మనస్సులో కుటుంబ కష్టాలు, అప్పులే మెదలడం ప్రారంభించాయి. మిస్సోరీలో అతని పరిస్థితి ఏమంత బాగా లేదు. జబ్బు పడ్డాడు, చదువులో వెనకపడ్డాడు. వరసగా రెండు సార్లు బి - గ్రేడ్లే వచ్చాయి. అతనికి కుటుంబం ఇంకే మాత్రం సాయం చేయలేని స్థితిలో పడింది. సుజిత్ కు క్షమాపణ ప్రసాదించాలని కోరుతూ అమెరికాలోని భారతీయలు 1,700 సంతకాలతో గవర్నర్ కు, మేయరుకు, అటార్నీ జనరల్ కు విజ్ఞప్తులు చేశారు. నిజామాబాద్ సంస్థ, అమెరికా తెలుగు సంఘం, తానాలు ఇందులో ప్రధాన పాత్ర పోషించాయి. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, శాసనసభా స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ సుజిత్ విడుదలకు కృషి చేశారు. అందుకు ఎంతో సంతోషించిన భువిత్ తన సోదరుడికి సహాయం అందించడానికి ముందుకు వచ్చిన ఎన్నారై సంఘాలకు, రాజకీయ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications
