ఆంధ్ర బాట పడతా: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణపై మద్దతు కూడగట్టడానికి తాను ఆంధ్ర ప్రాంతంలోనూ పర్యటిస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు చెప్పారు. రాజమండ్రి, విజయవాడ, తిరుపతి వంటి ప్రాంతాల్లో పర్యటించి తెలంగాణకు మద్దతు కోరుతానని ఆయన ఆదివారంనాడు మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అన్నారు. తాము బతుకుదెరువు కోసం తెలంగాణకు వచ్చిన ఆంధ్రా ప్రాంతంవారిపై పోరాటం చేయడం లేదని, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణలో పరిశ్రమలు పెట్టే ఆంధ్రా ప్రాంతంవారిని ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణ వెనుకబాటుకు పాలకుల వైఖరే కారణమని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు ముమ్మాటికీ తెలంగాణకు రెఫరెండమేనని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తమ ప్రచారానికి విశేష స్పందన లభిస్తోందని, తాము గెలిచి తీరుతామని ఆయన అన్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఉప ఎన్నికల తర్వాతనైనా కాంగ్రెస్ వైఖరి మారాలని ఆయన అన్నారు. లేకుంటే కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. రాజీనామాలు చేసి ఉప ఎన్నికలను ఆహ్వానించడం వెనక బలమైన వ్యూహం ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై సోనియా గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చినందుననే ఎన్నికల్లో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications