క్షమాపణ చెప్పే వరకు ఇలాగే: కృష్ణ
హైదరాబాద్: తమకు ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పే వరకు ఆ పత్రిక కార్యాలయాలను ముట్టడిస్తూనే ఉంటామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నాయకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సమాజం కోసం, అట్టడుగు వర్గాల కోసం పని చేస్తున్న తమను కించపరుస్తూ యాజమాన్యం వార్తాకథనం రాసిందని ఆయన విమర్శించారు. ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడిని ఆయన సమర్థించుకున్నారు. పత్రికా స్వేచ్ఛ హద్దులు దాటినప్పుడు ఇలాగే జరుగుతుందని ఆయన అన్నారు. దాడి చేస్తే కేసులు పెడతారు, జైలుకు వెళ్తామని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా పత్రికా కార్యాలయాలను ముట్టడిస్తామని, పత్రికను కొననివ్వబోమని ఆయన అన్నారు.
ఒక సినిమా యాక్టర్ రాజకీయాల్లోకి రాకముందే ప్రశంసిస్తూ వార్తలు రాసిన పత్రిక 20 ఏళ్లుగా ప్రజల కోసం, అట్టడుగు వర్గాల కోసం పని చేస్తున్న వారిని కించపరుస్తూ వార్తలు రాయడం మంచిది కాదని ఆయన అన్నారు. ఒక అగ్రకులానికి చెందిన హీరోను నాయకుడిని చేసేందుకే తమను కించపరుస్తూ వార్తలు రాశారని ఆయన విమర్సించారు. తాము ప్రశాంతంగా ధర్నా చేశామని, ఎవరైనా వెళ్లి పత్రికా కార్యాలయంపై దాడి చేశారమో తెలియదని ఆయన అన్నారు. ఆధారాలు ఉంటే వార్తలు రాయవచ్చునని, ఆధారాలు లేకుండా కించపరిచే విధంగా వార్తలు రాస్తే ఇలాగే జరుగుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications