అమలాపురం: భవిష్యత్‌లో టీడీపీ కార్యకర్తలకు తోడుగా నిలుస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భవిష్యత్‌లో పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఉండేలా చర్యలు చేపడుతానని ఆయన హామీ ఇచ్చారు. మీకోసం యాత్రలో భాగంగా చంద్రబాబు సోమవారం తూర్పుగోదావరి జిల్లా బండ్లారంకలోని చుట్టుప్రక్కల గ్రామాల్లో గల పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పనులన్నీ అధికారులకు అప్పగించానని పేర్కొన్నారు. ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే అలాంటి పొరబాటు జరగనివ్వబోనని తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే పనులన్నీ పార్టీ కార్యకర్తలకే అప్పగించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే పార్టీ కార్యకర్తల ఆరోగ్య పరిరక్షణకు కూడా తాను చర్యలు తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు. ఆర్థికస్థితి బాగోలేని కార్యకర్తలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య పరిరక్షణకు తగిన సాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు.