దేవేందర్ గౌడ్ పై తలసాని గరం
హైదరాబాద్: తమ పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ పై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తమ కమిటీ తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పిన దేవేందర్ గౌడ్ చెప్పిన మాటలతో ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విభేదించారు. కమిటీని తెలంగాణ కోసం వేయలేదని, రాజకీయ పరిణామాలపై, రాబోయే కొత్త పార్టీలపై నివేదిక ఇవ్వడానికి ఆ కమిటీని వేశారని ఆయన వివరించారు.
దేవేందర్ గౌడ్ కు సొంత ఎజెండా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. స్వార్థ ప్రయోజనాల కోసం దేవేందర్ గౌడ్ పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, దాన్ని పార్టీ కార్యకర్తలు ఉపేక్షించరని ఆయన అన్నారు. దేవేందర్ గౌడ్ సొంత ఎజెండాను ప్రకటిస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీని వీడిపోతానని దేవేందర్ గౌడ్ చేసిన వ్యాఖ్యపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పార్టీలో ఎవరున్నా, లేకపోయినా పార్టీ అధిష్ఠానవర్గం బెదరదని ఆయన అన్నారు. తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. రాజకీయ పరిణామాలను తాము విశ్లేషిస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
