అనంతపురం: పరిటాల రవి హత్య కేసులో ప్రధాన సాక్షి రామ్మోహన్‌రెడ్డి కోర్టు విచారణకు హాజరయ్యారు. పరిటాల రవి హత్య కేసుకు సంబంధించిన సాక్షుల విచారణ బుధవారం అనంతపురం సెషన్స్ కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా పరిటాల రవిని తామే హత్య చేశామని ప్రధాన సాక్షి రామ్మోహన్ రెడ్డి అంగీకరించాడు. జైలులో ఉన్న సూరిని తాను కలిసి సెల్‌ఫోన్ అందించినట్టు రామ్మోహన్ చెప్పాడు. పరిటాలను హత్య చేయడానికి తాము రిహార్సల్స్ చేశామని, చక్రవర్తి టవర్స్‌లోని ఎస్.ఎస్ గెస్ట్‌హౌస్ వద్ద నారాయణరెడ్డి, మొద్దుశీనులను తాను ఇందుకు సంబంధించి కలుసుకున్నట్టు కోర్టుకు తెలిపాడు. పరిటాల హత్య కేసులో భాగంగా జరుగుతున్న సాక్షుల విచారణ తిరిగి కొనసాగించాలని కోర్టు నిర్ణయించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది.