ఒంగోలు: మీ అనుభవం ఇతరులకు ఉపయోగపడాలని కోరుకుంటున్నానని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డ్వాక్రా మహిళలతో అన్నారు. డ్వాక్రా మహిళలతో సోనియా ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మహిళలు తమ అనుభవాలను వివరించారు. మీ జీవితాలు బాగుపడుతున్నందుకు నాకు సంతోషంగా ఉందని ఆమె మహిళలతో చెప్పారు. మీ ధైర్యం, ఉత్సాహం చూస్తుంటే మీ జీవితాలు తప్పక మారుతాయని అనిపిస్తోందని, మీ ముఖాల్లో అది కనిపిస్తోందని ఆమె అన్నారు.
మీ జీవితాలను మీరు మార్చుకుంటున్నారు, సాధికారత పొందుతున్నారు, మీ జీవితాలు తప్పక మారుతాయనే నమ్మకం నాకు కలుగుతోంది అని సోనియా గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.