భార్యను చంపిన ఎస్సై వేణుగోపాల్
హైదరాబాద్: భార్యను చంపి ఆమె శవం పక్కనే మద్యం సేవిస్తూ ఉన్న భర్త సంఘటన వెలుగు చూసింది. వేణుగోపాల్ అనే సబ్ ఇన్సెపెక్టర్ భార్య లీలావతిని హత్య చేసి మద్యం సేవిస్తూ ఇంట్లో నుంచి బయటకు రాలేదు. వేణుగోపాల్, లీలావతి దంపతులు గత ఆరు నెలలుగా ఉప్పల్ లోని చిలకనగరులో గల ఒక ఇంటిలో కిరాయికి నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. అయితే పిల్లలు ఊరు వెళ్లినట్లు సమాచారం.
గత రెండు రోజులుగా ఇంటికి గడియ వేసి ఉండడంతో వారు ఎటైనా వెళ్లిపోయి ఉంటారని స్థానికులు భావించారు. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి గడియ తీసి చూసి ఆశ్చర్యపోయారు. వేణుగోపాల్ భార్య శవం మంచంపై పడి ఉంది. వేణుగోపాల్ మద్యం సేవిస్తున్నట్లు అర్థమైంది. అతనే భార్యను హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. కాగా, తాను ఆదివారం మద్యం తెచ్చానని, ఇద్దరం మద్యం సేవించామని, మర్నాడు ఉదయం ఆమె లేవలేదని వేణుగోపాల్ చెప్తున్నాడు. అతని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications
