టిటిడి ఉద్యోగులతో ఇవో చర్చలు
తిరుపతి: ముగ్గురు అధికారులపై చర్యను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన తమ ఉద్యోగుల ప్రతినిధులతో తిరమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎగ్జిక్యూటివ్ అధికారి (ఇవో) రమణాచారి బుధవారం ఉదయం చర్చలు జరిపారు. టిటిడి ఉద్యోగులు బుధవారంనాడు కూడా టిటిడి పాలకమండలి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. వారితో అధికారులు కూడా కలిశారు. ఈ స్థితిలో ఇవో వారి ప్రతినిధులతో చర్చలు జరిపారు. నివేదిక ప్రకారం అధికారులపై చర్యలు తీసుకోవడం తన బాధ్యత అని, ఆ మేరకే తాను ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశానని ఆయన చెప్పారు.
సస్పెన్షన్ ను వెనక్కి తీసుకునే అధికారం తనకు లేదని, ఈ విషయంలో పాలక మండలికి మాత్రమే నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందని ఆయన చెప్పారు. రేపు (గురువారం) పాలక మండలి అత్యవసర సమావేశం జరుగుతుందని, ఈ సమావేశంలో చర్చిస్తామని ఆయన చెప్పారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్న టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఉద్యోగుల ప్రతినిధులతో చర్చలు జరిపారు. నివేదిక ప్రకారం అధికారులపై శాఖాపరమైన చర్య తీసుకోవడం తమ బాధ్యత అని, ఆ మేరకే తాము నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ స్థితిలో ఆందోళనను విరమించాలా, కొనసాగించాలా అనే విషయంపై ఉద్యోగులు ఆలోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications