ఐటి భూములపై దద్ధరిల్లిన అసెంబ్లీ
హైదరాబాద్: ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) కంపెనీలకు భూముల కేటాయింపుపై గురువారం శాసనసభ దద్ధరిల్లింది. ఐటి కంపెనీలకు భూములు కేటాయించే విషయంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. ఐటి కంపెనీలకు భూముల కేటాయింపుపై విచారణకు సభా సంఘం వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దానికి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో సభ దద్ధరిల్లింది. ఐటి కంపెనీలకు భూములు కేటాయించే నెపంతో రియల్టర్లకు సొమ్ము చేసి పెట్టి డబ్బులు దండుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. సభా సంఘాల నివేదికలు రహస్యంగా ఉండాలని, అయితే గొట్టాలు తీసుకొచ్చి ముందు పెట్టగానే వాటిని బహిర్గతం చేస్తున్నారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సభా సంఘాలపై చేసిన వ్యాఖ్యకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.
అవినీతి డబ్బుతో పత్రికను, చానెల్ ను పెట్టారని చంద్రబాబు ముఖ్యమంత్రిపై విమర్శలు చేశారు. వాణిజ్య ప్రకటనలకు ముఖ్యమంత్రి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని, ఆరు నెలలు నిండని సాక్షి దినపత్రికకు ప్రభుత్వ ప్రకటనలు ఎలా ఇస్తారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థిక మండళ్లపై (సెజ్ లపై) విచారణ జరిపించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. సెజ్ లతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు లాభపడుతున్నాయని ఆయన అన్నారు. నానక్ రాం గుడాలో 52 శాతం భూమిని ఐటియేతర కంపెనీలకు ఎలా ఇచ్చారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యుడు హరీష్ రావు ప్రశ్నించారు. ఐటియేతర కంపెనీలకు బహిరంగ వేలం ద్వారా భూములు ఇవ్వాల్సి ఉండగా సబ్సిడీకి ఎందుకు ఇస్తున్నారని ఆయన అడిగారు. ఒఎన్ జిసికి రెండు కోట్ల రూపాయలకు భూమిని ఇచ్చి ఓ ప్రైవేట్ కంపెనీకి 85 లక్షల రూపాయలకే ఎలా ఇచ్చారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.












Click it and Unblock the Notifications
