గొట్టాలపై గొడవ: వైయస్ విచారం
హైదరాబాద్: శాసనసభలో గురువారం గొట్టాలపై గొడవ జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గొట్టాలుగా అభివర్ణించడంపై నిరసన వ్యక్తమైంది. ఐటి కంపెనీలకు భూముల కేటాయింపుపై సభా సంఘం వేయాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్ కు స్పందిస్తూ ముఖ్యమంత్రి అందుకు అంగీకరించకుండా ఎలక్ట్రానిక్ మీడియాను గొట్టాలుగా అభివర్ణించారు. సభా సంఘాల వల్ల లాభమేమీ లేదని, గొట్టాలవాళ్లు ఎదురైనప్పుడు ఏదో ఒకటి మాట్లాడడానికి సభా సంఘాలు పనికి వస్తాయని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి వాడిన పదంపై నిరసన వ్యక్తం చేస్తూ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. దీంతో ముఖ్యమంత్రి తాను వాడిన పదంపై శాసనసభలో వివరణ ఇచ్చారు. తన మాట ఎవరినైనా బాధించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన అన్నారు. ప్రింట్ మీడియాను, ఎలక్ట్రానిక్ మీడియాను వేరు చేసి చెప్పడానికి మాత్రమే అ పదం వాడానని, అందులో వేరే ఉద్దేశం ఏదీ లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వాడిన పదంలో తప్పేమీ లేదని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం ముఖ్యమంత్రికి లేదని సమాచార పౌర సంబంధాల మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి చెప్పారు. సాధారణ ప్రజలు వాడే వాడుక పదాన్ని మాత్రమే ముఖ్యమంత్రి వాడారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
