చిరుతో అమర్, జయ ద్వయం
హైదరాబాద్: ప్రజారాజ్యం అధినేత చిరంజీవితో సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ ఆదివారం సాయంత్రం సమావేశమయ్యారు. ప్రజారాజ్యం కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. అమర్ సింగ్ తో పాటు సమాజ్ వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాళ్లు జయప్రద, జయాబచ్చన్ కూడా చిరంజీవితో సమావేశమయ్యారు. సమాజ్ వాదీ పార్టీ నేతలు సాయంత్రం ఐదు గంటలకు ప్రజారాజ్యం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వెంటనే చిరంజీవితో సమావేశమయ్యారు. ఈ భేటీ గంటకు పైగా సాగింది.
ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటుకు సిద్ధపడ్డ సమాజ్ వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి పార్టీతో కలిసి పాగా వేయాలని భావిస్తోంది. అమితాబ్ బచ్చన్ తో చిరంజీవికి ఉన్న స్నేహాన్ని, జయప్రదతో ఉన్న పాత పరిచయాన్ని ఇందుకు వాడుకోవాలని సమాజ్ వాదీ పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. శుభాకాంక్షలు తెలియజేయడానికే తాము చిరంజీవిని కలుస్తున్నామని అమర్ సింగ్ చెప్పినప్పటికీ పొత్తు గల అవకాశాలపై మాట్లాడే అవకాశం లేకపోలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications
