చంద్రబాబుకు బాలయ్య హామీ
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పార్టీకి విస్తృతంగా ప్రచారం చేస్తామని నందమూరి వారసులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి హామీ ఇచ్చారు. దాదాపు ఆరు నెలల పాటు స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశయాల కోసం తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు చెప్పారు. చంద్రబాబుతో నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ ఆయన నివాసంలో ఆదివారంనాడు సమావేశమయ్యారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల ప్రచార కార్యక్రమానికి రూపకల్పన చేయాలని కూడా వారు ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు.
బాలకృష్ణ ఈ నెల 15వ తేదీన తన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణల కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం కొనసాగిస్తారు. ఈ కార్యక్రమాల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొంటారు. గుంటూరులో జరిగే యువగర్జన సదస్సులో కూడా వీరిద్దరు పాల్గొనే అవకాశం ఉంది. బాలకృష్ణ విస్తృత స్థాయిలోనూ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాస్తా పరిమితంగానూ ప్రచారం సాగిస్తారు. యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను కూడా ఎక్కువగానే, ముఖ్యంగా కొస్తా ప్రాంతంలో ప్రచారానికి వాడుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. సమావేశానంతరం నందమూరి కుటుంబ సభ్యులకు చంద్రబాబు మధ్యాహ్నం విందు ఇచ్చారు.












Click it and Unblock the Notifications
