చిరు సభ కన్నా ముందే ఖరారు: డిఎస్
తిరుపతి: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి బహిరంగ సభ కన్నా ముందే తిరుపతిలో తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సదస్సు తేదీ ఖరారైందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. సోనియా గాంధీ ఈ నెల 11వ తేదీన తిరుపతిలో జరిగే మహిళా సదస్సుకు హాజరవుతారని ఆయన చెప్పారు. ఈ సదస్సుకు సంబంధించిన పోస్టరును ఆయన ఆదివారం విడుదల చేశారు. ఇది బహిరంగ సభ కాదని, సదస్సు మాత్రమేనని ఆయన చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయం ఎవరనేది తమకు అవసరం లేదని, ప్రజారాజ్యం పార్టీయా, తెలుగుదేశం పార్టీయా తమకు అవసరం లేదని, గెలవడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. తమకు ప్రత్యామ్నాయం ఎవరైనా తమకేమీ పట్టి లేదని ఆయన అన్నారు. మహిళా సదస్సు ఏర్పాట్లను ఆయన ఆదివారం పర్యవేక్షించారు. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు, మంత్రి రఘువీరా రెడ్డి తదితరులు ఏర్పాట్లను సమీక్షించారు.












Click it and Unblock the Notifications
