ఢిల్లీ పేలుళ్లు: ఇద్దరి నేరాంగీకారం
న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుళ్ల కేసులో పోలీసులు కీలకమైన పురోగతి సాధించారు. శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల అనంతరం అరెస్టు చేసిన ఇద్దరు రెండు ప్రాంతాల్లో పేలుడు పదార్థాలను పెట్టినట్లు అంగీకరించారని పోలీసులు చెప్పారు. ఎదురుకాల్పుల్లో ఇద్దురు మిలిటెంట్లు మరణించగా ఒక మిలిటెంట్ పోలీసుల చేతికి చిక్కాడు. జీషాన్ అనే మరో మిలిటెంటును పోలీసులు ఒక టీవీ చానెల్ కార్యాలయంలో అదుపులోకి తీసుకున్నారు. టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్లగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఎదురుకాల్పులకు నేతృత్వం వహించిన శర్మ అనే పోలీసు అధికారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారంనాడు మరణించారు.
ఎదురుకాల్పులు జరిగిన వెంటనే పోలీసుల చేతికి చిక్కిన మహ్మద్ సైఫ్ వెల్లడించిన సమాచారం మేరకు బాంబులు పెట్టిన కనీసం పదిమంది పోలీసులకు చిక్కాల్సి ఉంది. తాను కన్నాట్ ప్లేస్ లోని రీగల్ సినిమా వద్ద బాంబు పెట్టినట్లు సైఫ్ అంగీకరించాడు. చెత్త ఏరుకునే బాలుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ బాంబును కనిపెట్టి నిర్వీర్యం చేశారు. ఢిల్లీలో ఒక్కో చోట బాంబులు పెట్టడానికి ఇద్దరేసి మిలిటెంట్లు వెళ్లారని పోలీసులు చెప్పారు.
పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన అతిక్ పేలుళ్ల వెనక ప్రధాన సూత్రధారి అని సైఫ్ చెప్పినట్లు సమాచారం. అతను ముజాహిదీన్ సభ్యుడని పోలీసులు చెప్పారు. అతిక్ స్వయంగా గ్రేటర్ కైలాష్ మార్కెట్ లో బాంబు పెట్టాడు. బాంబులు పెట్టిన పదిమందిని అతిక్ జులై 27వ తేదీన ఢిల్లీకి తీసుకొచ్చాడని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications