నారాయణ ప్రమాదం: విద్యార్థి మృతి
హైదరాబాద్: హైదరాబాదుకు సమీపంలోని బోడుప్పల్ లో గల నారాయణ కార్పోరేట్ జూనియర్ కళాశాల భవనం మూడో అంతస్థు గోడ కుప్పకూలి ఒక విద్యార్థి మరణించాడు. ఆ విద్యార్థి మృతదేహాన్ని శిథిలాల నుంచి వెలికి తీశారు. మరణించిన విద్యార్థిని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన లోకేశ్వర్ రెడ్డిగా గుర్తించారు. మరో 27 మంది విద్యార్థులను కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సంభవించిన వెంటనే అంబులెన్సులు వచ్చాయి. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే విద్యార్థినీవిద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలకు వచ్చారు. వారు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. కళాశాల యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
శిథిలాల కింద 40 మంది విద్యార్థుల దాకా చిక్కుకున్నట్లు అనుమానించారు. ఈ భవంతి మూడో అంతస్థు గోడను మూడు నెలల క్రితం కట్టారు. శిథిలాల కింద సెప్టిక్ ట్యాంకు ఉంది. ఏడు ఆడుగుల దాకా ఉన్న ఈ ట్యాంకులో కూడా విద్యార్థులు పడిపోయారనే ఆ విషయాన్ని పరిశీలిస్తున్నారు. నిర్మాణ లోపంవల్లనే భవనం కూలిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోడ కూలిన వెంటనే విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ఈ కళాశాల ఈ విద్యాసంవత్సరమే ప్రారంభమైంది. ఈ ప్రమాదంపై మాట్లాడడానికి కళాశాల యాజమాన్యం అందుబాటులో లేదు. ఈ సంఘటనపై సాయంత్రంలోగా నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జిల్లా విద్యాధికారిని ఆదేశించారు.












Click it and Unblock the Notifications