సిపిఐతో చిరు చర్చలు ప్రాథమికమే: మిత్రా
హైదరాబాద్: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణతో జరిగినవి ప్రాథమిక చర్చలేనని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా చెప్పారు. పొత్తులపై వచ్చేవన్నీ ఊహాగానాలేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పొత్తుల గురించి తాము ఇప్పుడే ఏమీ ఆలోచించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమాల మీద, ప్రజాసమస్యల మీద నారాయణ తమ విధానాలను చెప్పారని, తాము తమ విధివిధానాలను చెప్పామని, అంతే తప్ప పొత్తుల గురించి చర్చించలేదని ఆయన అన్నారు. ప్రజాసమస్యలపై చేసే పోరాటాల్లో తమతో కలిసి వచ్చేవారితో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు.
తాము ప్రజా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని అనుకుంటున్నామని, ఈ కృషిలో ఎవరు కలిసి వచ్చినా వారితో పని చేస్తామని ఆయన అన్నారు. తాము తాత్కాలిక ప్రయోజనాల కోసం పనిచేయడం లేదని, ప్రజలకు మేలు చేయడానికి తాము పని చేయదలుచుకున్నామని ఆయన చెప్పారు. తొమ్మిదేళ్లు తెలుగుదేశం పార్టీ రాష్టాన్ని పాలించిందని, ప్రజా సమస్యలను పరిష్కరించే అవకాశం ఆ పార్టీకి ఆ రకంగా అవకాశం దక్కిందని, ఆ అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వాడుకున్నదనేది ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. పార్టీల మంచిచెడులను ప్రజలే నిర్ణయిస్తారని, తాము తెలుగుదేశం పార్టీ విమర్శలకు సమాధానం చెప్పదలుచుకోలేదని ఆయన అన్నారు. తమ పార్టీ విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications