బాబాయ్ బాలయ్య వెంటే ఉంటా: తారకరత్న
ఒంగోలు: తాను తమ బాబాయ్ బాలయ్య వెన్నంటే ఉంటానని నందమూరి వంశానికి చెందిన సినీ హీరో తారకరత్న అన్నారు. తమ మామయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేసే వరకు నిద్రపోమని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా మార్టూరులో ఆయన గురువారం రక్తదాన శిబిరాన్ని, ఇతర సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలుగుదేశం తమ తాతయ్య స్వర్గీయ ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ అని, దాన్ని కాపాడుకోవడం తమ బాధ్యత అని ఆయన అన్నారు.
తాము పదవుల కోసం రాజకీయాల్లోకి రావడం లేదని, పోటీ చేయడానికి కూడా కాదని, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం కల్పించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. తమ కుటుంబంలో విభేదాలున్నాయని మీడియా ప్రచారం చేస్తోందని, తమ కుటుంబంలో ఏ విధమైన విభేదాలు లేవని ఆయన అన్నారు. తమ బాబయ్ వెన్నంటి ఉండడం, మామయ్యను ముఖ్యమంత్రిని చేయడం తమ లక్ష్యమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications