జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నగారా
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్ శాసనసభకు ఏడువిడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నెల రోజుల పాటు ఏడు విడతలుగా జమ్మూ కాశ్మీర్ లో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 17, 23, 30, డిసెంబర్ 7, 13, 17, 24 తేదీల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరపనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘ ప్రధానాధికారి గోపాలస్వామి తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ శాసనసభలో మొత్తం 87 సీట్లు ఉన్నాయి. వీటిలో ఏడు సీట్లు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించి ఉన్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 28వ తేదీన జరుగుతుంది. ఎన్నికలకు తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు గోపాలస్వామి చెప్పారు. జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించే విషయమై ఎన్నికల కమీషన్ లో భిన్నాభిప్రాయాలున్నాయి. జమ్మూ కాశ్మీరులో వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి పరిస్థితులు సానుకూలంగా లేవని గోపాల స్వామి వాదిస్తూ వచ్చారు. రాష్ట్ర అధికారులు పోలింగ్ విధులు నిర్వహించడానికి సిద్ధపడడం లేదని, రాజకీయ పార్టీలు సహకరించడం లేదని ఆయన అంటూ వచ్చారు. ఇతర ఎన్నికల కమీషనర్లు మాత్రం ఎన్నికలు నిర్వహించాలని వాదిస్తూ వచ్చారు. కాగా, ఎన్నికలను బహిష్కరించాలని జెకెఎల్ఎఫ్ పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications
