ఎన్టీఆర్ ను చూసి చిరు వాతలు: రోజా
విశాఖపట్నం : మహానటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఎన్టీ రామారావును చూసి వాళ్లు వాతలు పెట్టుకుంటున్నారని, వాళ్లను చూసి తాము వాతలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. అన్నీ వర్గాలకు అభిమానపాత్రులైన సినీనటులను చూసేందుకు జనం రావడం సహజమని అయితే వారంతా ఓట్లు వేస్తారనే అతివిశ్వాసం తగదని ఆమె ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రంలో ఎన్ని విధానసభ నియోజకవర్గాలున్నాయో ప్రజారాజ్యంపార్టీ నేతలకు తెలిసినట్టు లేదని అందుకే 200 స్థానాలు గెలుస్తామని వారు ప్రకటనలు చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ప్రజలు ఓటేస్తారని, తమ నాయకుడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రజలకు మెరుగైన పాలనను అందించారని, అదే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తుందని ఆమె అన్నారు. తాము తిరిగితే తమ సభలకు కూడా ప్రజలు వస్తారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారని ఆమె విమర్శించారు. రాజశేఖర రెడ్డి మాటలకు ప్రజలు మోసపోయారని ఆమె అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని ఆమె అన్నారు. తెలుగుదేశం పాలనలోనే మహిళలకు సాధికారిత లభిస్తుందని నమ్ముతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
