కెసిఆర్ కు తలుపులు తెరిచే ఉన్నాయి: విహెచ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తమతో కలిసి వస్తానంటే సంతోషమని, కెసిఆర్ కు తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. తెలంగాణపై తమ వైఖరిలో మార్పు లేదని, తెలంగాణకు అనుకూలంగానే ఉన్నామని ఆయన చెప్పారు. పిసిసి కార్యవర్గంలో చాలా మందికి అన్యాయం జరిగిందని, పిసిసి కార్యవర్గాన్ని పునర్వ్యస్థికరించాలని ఆయన అన్నారు. తెలంగాణపై సోనియా గాంధీ స్పష్టంగా ఉన్నారని, కెసిఆర్ మద్దతు ఉపసంహరించుకోలేదని, దాన్ని బట్టే సోనియా తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చునని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ తో మాట్లాడడంలో తప్పు లేదని, చొరవ తీసుకుని పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మాట్లాడుతారని భావిస్తున్నానని ఆయన అన్నారు.
ఉగ్రవాదులు ఎంతటివారైనా ప్రభుత్వం రాజీ ధోరణిని అవలంబించకూడదని హనుమంతరావు అన్నారు. ఓట్ల కోసం అభివృద్ధి చేయాలే తప్ప, వర్గ రాజకీయాలకు పాల్పడవద్దని ఆయన హితవు పలికారు. ఈ విషయంలో వైఎస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆయన రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర అవార్డు ప్రదాన కార్యక్రమంలో సూచించారు. అధికారం కోసం పాకులాడుతున్న రాజకీయ పార్టీలు సమాజంలో సన్నగిల్లుతున్న శాంతి, మతసామరస్యాలను పెంపొందించేందుకు ఎలాంటి చొరవా చూపడం లేదని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ విమర్శించారు. ప్రజల్లో సద్భావన కల్పించేందుకు రాజకీయ నాయకులు పాటుపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర అవార్డు గ్రహీత, పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డిని డీఎస్ ఆదివారం సన్మానించారు.












Click it and Unblock the Notifications
