అప్పుడే రాజీనామా చేశా: విలాస్ రావ్
ముంబయి: తన రాజీనామాపై పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయం తీసుకుంటుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ అన్నారు. తాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలోనే రాజీనామా సమర్పించినట్లు ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తన రాజీనామాను డిమాండ్ చేసే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి లేదని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆర్ ఆర్ పాటిల్ రాజీనామా చేసిన వెంటనే విలాస్ రావు దేశ్ ముఖ్ రాజీనామా చేసిన విషయం బయటకు వచ్చింది. తాజ్ హోటల్ కు తన కుమారుడు రితేష్ తీసుకుపోవడంలో తప్పు లేదని దేశ్ ముఖ్ అన్నారు. తీర ప్రాంత గస్తీ కోసం స్పీడ్ బోట్లు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మత్స్యకారులకు స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని ఆయన చెప్పారు. భద్రత కోసం కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
ఆర్ పాటిల్ రాజీనామా విషయంలో తమ పార్టీ నిర్ణయం తీసుకుందని ఎన్సీపి చీఫ్ శరద్ పవార్ చెప్పారు. విలాస్ రావ్ దేశ్ ముఖ్ రాజీనామా విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి రాజీనామాను ఆమోదించాల్సిందేనని పేరు చెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. విలాస్ రావు దేశ్ ముఖ్ నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రులు పృథ్వీరాజ్ చవాన్ పేరు, సుశీల్ కుమార్ షిండే పేరు వినిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్సీపి నేత ఛగన్ భుజ్ బల్ ప్రయత్నాలు మొదలు పెట్టారు.












Click it and Unblock the Notifications
