• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నన్ను కాల్చేస్తారా..చంపేస్తారా?:పవన్

By Staff
|

Pawan Kalyan
హైదరాబాద్ :"రాళ్లేస్తారా..? చంపుతారా..? ఏకే 47తో కాల్చేస్తారా? లేక మందుపాతర పెట్టి పేల్చేస్తారా...!? అంటూ మరోసారి కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి యువరాజ్యం అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన విరుచుకుపడ్డారు. రెండ్రోజుల కిందట ధర్నాలో కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, దానిపై ఆ పార్టీ నాయకుల స్పందన, వరంగల్‌ జిల్లాలో తన కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడి తదితరాలపై గురువారం పవన్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే...

''కాంగ్రెస్‌ నాయకులు, వారి కిరాయి గూండాలు ఎలా రక్తకణాలతో పుట్టారో, మేమూ అలాగే పుట్టాం. మాకూ దమ్ము, ధైర్యం, తెగింపు ఉన్నాయి. ఈ విషయాన్ని వారి మెదళ్లలో డ్రిల్‌ చేసి పెట్టుకోవాలి. మేమూ తాడో పేడో తేల్చుకుంటాం. ప్రజాస్వామ్య విలువలపై నమ్మకంతో ఉన్నాం. అలా మమ్మల్ని ఉండనిస్తారో, లేదో వారే తేల్చుకోవాలి. ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త, గూండా వారి పరిమితుల్లో వారుంటే మేమూ అలాగే ఉంటాం. రాజకీయాల్లోకి వచ్చే ముందే మా కుటుంబంలో చర్చించుకున్నాం. ప్రాణ త్యాగానికి నేను సిద్ధపడే వచ్చా. నాకు ఏం జరిగినా బాధపడొద్దని నా తల్లి, చనిపోయిన నా తండ్రి, అన్నలు, అక్కలతో చెప్పా. నా జీవిత భాగస్వామితో మాట్లాడా! అర్థమైనా కాకపోయినా నా కొడుకుతోనూ చెప్పా. కాంగ్రెస్‌ నాయకుడు దానం నాగేందర్‌ నన్ను పిచ్చికుక్క అన్నాడు. నేను ఆ మాట అనలేక కాదు. ఆయన స్థాయికి దిగజారలేక ఊరుకుంటున్నాను. మంత్రి షబ్బీర్‌అలీ దేశ ద్రోహి అన్నాను. ఆమాట సవరించుకుంటున్నాను. ఆయన దైవ ద్రోహి''.

యాసిడ్‌ దాడిలో గాయపడి చనిపోయిన స్వప్నిక తల్లిదండ్రుల్ని పరామర్శించేందుకు వరంగల్‌ జిల్లాకు వెళ్లి వస్తుంటే తన బందోబస్తు కాన్వాయ్‌పై కాంగ్రెస్‌ గూండాలు రాళ్లతో దాడిచేశారని పవన్‌ ఆరోపించారు. చిరంజీవిని రక్తవ్యాపారి అని, శని నాయకుడు అని కాంగ్రెస్‌ నాయకులు, ముఖ్యమంత్రి విమర్శిస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో పత్రికా ముఖంగా ఖండించాం తప్ప గాంధీభవన్‌పై దాడికి వెళ్లలేదని గుర్తుచేశారు. పులివెందులలో మహిళా నాయకురాలు శోభానాగిరెడ్డిపై అనాగరికంగా దాడిచేసినా వూరుకున్నామని ప్రస్తావించారు.

''మాకు మనుషుల్లేరా? మాలో చేవలేదా? దాడిచేయలేక కాదు... ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాం కాబట్టే మౌనంగా ఉండిపోయాం'' అని వివరించారు. ''ధర్నా సందర్భంగా నేను చేసిన వ్యాఖ్యానాలు ఆవేశంగానో, అనాలోచితంగానో చేసినవి కావు. రెండు దశాబ్దాలుగా దిగజారిపోతున్న రాజకీయ విలువల్నిచూసి కడుపు మండి చేశాను. ప్రజల్ని రక్షించాల్సిన ప్రభుత్వమే వారిని దోపిడీ చేస్తుండటం చూసి మాట్లాడాను. దీనిపై ఎలాంటి విచారంలేదు. పైగా నేను చేసిన వ్యాఖ్యలపై సంతోషిస్తున్నా. బయట జనం ఇంకా దారుణంగా మాట్లాడుతున్నారు.

నేను కొత్తగా ఒక్క కొత్త విషయం చెప్పలేదు. 2004లో నక్సలైట్లతో చర్చలు జరిపారు. తరువాత వెంటాడి వేటాడి 80 మందికి పైగా నక్సలైట్లను చంపేశారు. ఈ విషయాన్ని తెలంగాణ విద్యార్థి వేదిక నుంచి గద్దర్‌ చెప్పారు. ఎన్నికలకు ముందు తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. తరువాత పొత్తు పెట్టుకున్న పార్టీనే చీల్చారు. ఎప్పుడు తెలంగాణ వస్తుందో, అసలు వస్తుందో, రాదో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. వైఎస్‌ వెన్నుపోటు పొడిచారని అందరూ అంటున్నారు. నేనూ అన్నాను. దీనికెందుకు కోపం? ముఖ్యమంత్రి కాకముందు వైఎస్‌ పాదయాత్ర చేసి రైతులకు సన్నిహితం అయ్యారని తెలిసి నేనూ మామూలు వ్యక్తిలా సంతోషించాను.

ఇప్పుడేమో బడా కంపెనీలకు సెజ్‌ల పేరుతో రైతుల భూములు ఇచ్చేస్తున్నారు. అవుటర్‌ రింగురోడ్డులో చిన్నరైతుల భూములే పోయేలా చూశారు. భీంరావుబాడలో 90 ఏళ్ల నుంచి, మూడు తరాలుగా ఉంటున్న వారిని రాత్రికి రాత్రి పోలీసుల సాయంతో ఖాళీ చేయించారు. వీరికి పునరావాసం గురించి చెప్పాలంటే అదో పెద్దకథ అవుతుంది. నేను పాతబస్తీకి చెందిన మైనారిటీ నాయకులతో మాట్లాడాను. ఉర్దూ మీడియాతోనూ చర్చించాను. వక్ఫ్‌ భూముల్ని షబ్బీర్‌అలీ ద్వారా దోచేస్తున్నారని అందరూ చెబుతున్నారు. వారి మాటలు, బాధనే నేను ఉదహరించాను'' అని పవన్‌ చెప్పుకొచ్చారు. గతంలో ఎందుకు ఇలా స్పందించలేదని విలేకరులు ప్రస్తావించగా... సరైన సమయం, సందర్భంగా కోసం చూశానని బదులిచ్చారు. యువరాజ్యం అధ్యక్షునిగా తన పరిధి పెరిగినందున ఇప్పుడు స్పందిస్తున్నానన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తుల అమ్మకం, ఐఎస్‌ఐ ఏజెంటు ఇంటికి వెళ్లిరావటంపైనే షబ్బీర్‌ను తాను విమర్శించాను తప్ప మైనారిటీలను ఏమీ అనలేదని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X