'సాక్షి'లో అక్రమ పెట్టుబడులు: బాబు
హైదరాబాద్: సాక్షి దినపత్రికను ప్రచురిస్తున్న ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జగతి పబ్లికేషన్స్ అక్రమాలకు నిలయంగా మారిందని విపక్షనేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వూరూ పేరు లేని కంపెనీలు కోట్ల రూపాయల పెట్టుబడులు సాక్షి పత్రికలో, ఇందిరా టెలివిజన్‌లో ఎందుకు పెట్టారో విచారణ జరిపి తేల్చాలని విపక్షనేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. సత్యం, మేటాస్ వ్యవహారాలపై చర్చ సందర్భంగా ఆయన శాసనసభలో సోమవారం ఈ డిమాండ్ చేశారు.
చట్టవ్యతిరేకంగా 14 కంపెనీలు పెట్టి నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారని ఆరోపించారు. సత్యం అవకతవకలకు సాక్షీభూతంగా నిలిచిన ప్రైస్ వాటర్ కూపర్స్ సంస్థ ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా ప్రభుత్వం ఎలా ప్రకటనలు ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. విదేశీ పెట్టుబడుల పరిమితి చట్టాన్ని సాక్షి యాజమాన్యం యధేఛ్చగా ఉల్లంఘించారని ఆరోపించారు. అన్ని నిబంధనలను తుంగలో తొక్కిన జగతి పబ్లికేషన్స్ సంస్థపై విచాఇరణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి పిల్లలను పెంచడం రాదని ఆయన వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డి తన కుమారుడిని చక్కగా పెంచి ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదని ఆయన అన్నారు. తన కుమారుడిని తాను ఎంతో బాధ్యతగా పెంచానని ఆయన చెప్పారు. తన కుమారుడు లోకేష్ కష్టపడి చదువుకున్నాడని, బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదిగాడని ఆయన చెప్పుకున్నారు. తన కుమారుడి చదువులో అక్రమాలు జరిగినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications