జగన్ అవినీతిపై దుమారం
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, సాక్షి దిన పత్రిక అధిపతి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలతో సోమవారం శాసనసభ దద్ధరిల్లింది. అసెంబ్లీ సోమవారం సమావేశం కాగానే ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు జగన్‌ల అవినీతిపై, తప్పుడు అఫిడవిట్లు, నిధుల మళ్లింపు,సత్యంపై టీడీపీ వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టింది. బాలరాజు ఆత్మహత్యపై తెరాస, వామపక్షాలు వాయిదాతీర్మానాలు ప్రవేశపెట్టాయి. వీటిని స్పీకర్ తిరస్కరించారు. అయితే వాయిదా తీర్మానాలపై చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ముందుగా ప్రశ్నోత్తరాలను చేపడతానని పది గంటల అనంతరం సత్యంపై చర్చ ఉంటుందని స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. సభ్యులు వారు అంగీకరించిన నిబంధలను వారే ఉల్లంఘిస్తున్నారని శాసనసభా వ్యవహారాల మంత్రి రోశయ్య అన్నారు. విపక్షాల తీర్మానాలపై చర్చకు స్పీకర్ అంగీకరించకపోవటంతో విపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. దీంతో శాసనసభా కార్యక్రమాలు స్తంభించాయి. వారు అక్కడినుంచి ఎంతగా చెప్పినా కదలకపోవటంతో స్పీకర్ సభను 10 నిముషాలు వాయిదావేశార సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా గందరగోళం కొనసాగటంతో సభను తిరిగి 15 నిముషాలు వాయిదావేశారు. సభ రెండుసార్లు వాయిదాపడటంతో స్పీకర్ తన ఛాంబర్లో అన్ని పక్షాల శాసనసభాపక్ష నేతలతో భేటీ అయ్యారు. సభ ఎజెండాపై ముందుగానే చర్చించి అందరూ ఓ అంగీకారానికి రావాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. అనంతరం సభలో ఎలాంటి అంతరాయం లేకుండా ఎజెండా ప్రకారం చర్చ సాగాలని, సభ్యులంతా దీనికి కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. సభా సమయాన్ని అనవసరంగా వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సత్యం, మేటాస్ కంపెనీలపై చర్చ సాగింది.












Click it and Unblock the Notifications