400 కోట్ల ఏళ్ల నాటి మిస్టరీ వీడింది! అంతరిక్షంలో చక్కెర వర్షం..
అనంత విశ్వంలో ఖగోళ శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన 'తీపి' విషయాన్ని కనుగొన్నారు. నక్షత్రాలు, గ్రహాల మధ్య ఉండే ఇంటర్‌స్టెల్లార్ స్పేస్ ను తొలిసారిగా సహజసిద్ధమైన చక్కెర అణువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా మనం తినే రాస్ప్‌బెర్రీ పండ్లలో లభించే "ఎరిథ్రూలోజ్" (Erythrulose) అనే చక్కెర రకాన్ని పాలపుంత (Milky Way) కేంద్రానికి సమీపంలో ఉన్న భారీ అంతరిక్ష ధూళి, వాయు మేఘాలలో కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ఖగోళ శాస్త్ర చరిత్రలోనే అత్యంత కీలకమైన మైలురాయిగా నిలవనుంది.
జీవం మనుగడకు అత్యంత అవసరమైన సేంద్రీయ సమ్మేళనాలు భూమి అవతల కూడా స్వయంగా ఏర్పడగలవని ఈ పరిశోధన నిరూపించింది. మానవ శరీరంలో శక్తిని అందించడానికి, కణాల నిర్మాణానికి, చివరకు మన జన్యుపదార్థమైన డీఎన్ఏ (DNA), ఆర్ఎన్ఏ (RNA) ల రూపాంతరానికి చక్కెర కణాలు చాలా ముఖ్యం. స్పెయిన్‌కు చెందిన సెంటర్ ఫర్ ఆస్ట్రోబయాలజీ పరిశోధకులు ఈ అద్భుత శోధన చేశారు. స్పెయిన్‌లోని రెండు శక్తివంతమైన రేడియో టెలిస్కోపులను ఉపయోగించి పాలపుంత మధ్యలో ఉండే 'G+0.693-0.027' అనే భారీ అణు మేఘాన్ని వారు నిశితంగా పరిశీలించారు. అక్కడ సేకరించిన తరంగాల డేటాను ల్యాబొరేటరీ పరిశోధనలతో సరిపోల్చగా.. నాలుగు కార్బన్ పరమాణువులు ఉండే 'ఎరిథ్రూలోజ్' ఉనికి స్పష్టమైంది.

సైన్స్ సిద్ధాంతాలకే సవాల్!
సాధారణంగా అంతరిక్షంలో ఉండే రసాయనాలు ఒకదాని తర్వాత ఒకటి కార్బన్ పరమాణువులను జోడించుకుంటూ క్రమంగా పరిమాణంలో పెద్దవవుతాయని ఖగోళ రసాయన శాస్త్రవేత్తలు భావిస్తారు. కానీ, అంతరిక్షంలో ఇంకా నక్షత్రాలు లేదా గ్రహాలు పుట్టకముందే ఇంతటి సంక్లిష్టమైన చక్కెర అణువులు స్వయంగా ఏర్పడటం సైంటిస్టుల ఊహకు కూడా అందలేదు. అంతరిక్షంలోని అతి శీతల మంచు ధూళి రేణువులపై సరళమైన అణువుల కలయిక వల్ల ఈ ఎరిథ్రూలోజ్ సులభంగా ఏర్పడి ఉండవచ్చని పరిశోధన నేతృత్వం వహించిన ఖగోళ శాస్త్రవేత్త ఇజాస్కున్ జిమెనెజ్-సెర్రా తెలిపారు.
భూమిపైకి జీవం ఎలా వచ్చింది?
ఇప్పటివరకు ఉల్కలు, బెన్ను (Bennu) వంటి గ్రహశకలాల్లో మాత్రమే ఇలాంటి చక్కెర జాడలు కనిపించాయి. అయితే, అంతరిక్షంలోనే నేరుగా ఈ అణువులు బయటపడటంతో.. మన సౌర వ్యవస్థ ఏర్పడక ముందే ఇటువంటి సేంద్రీయ పదార్థాలు విశ్వంలో విస్తరించి ఉన్నాయనే బలమైన సంకేతం లభిస్తోందని లండన్ ఇంపీరియల్ కాలేజ్ ప్రొఫెసర్ మార్క్ సెప్టన్ వివరించారు. దాదాపు 400 కోట్ల సంవత్సరాల క్రితం గ్రహశకలాలు, తోకచుక్కలు భూమిని బలంగా ఢీకొట్టిన కాలంలో.. కోట్ల టన్నుల కొద్దీ ఈ చక్కెర కణాలు అంతరిక్షం నుండి భూమిపై పడి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
మనం స్కిన్ టానింగ్ ఉత్పత్తుల్లో వాడే ఈ ఎరిథ్రూలోజ్ చక్కెర విశ్వంలో దొరకడం శాస్త్రవేత్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. "ఈ శోధన కేవలం ఒక ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో ఆర్ఎన్ఏ (RNA) లో ప్రధాన భాగమైన 'రైబోజ్' వంటి మరిన్ని కీలకమైన చక్కెర్లను అంతరిక్షంలో కనుగొనేందుకు ఈ పరిశోధన మార్గం సుగమం చేసింది" అని శాస్త్రవేత్త కార్లోస్ బ్రయోనస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అద్భుత పరిశోధన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ 'నేచర్ ఆస్ట్రానమీ'లో ప్రచురితమయ్యాయి.














Click it and Unblock the Notifications