సత్యంపై పార్లమెంటులో దుమారం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లోనూ సత్యం కంప్యూటర్స్ వ్యవహారంపై మంగళవారం దుమారం చెలరేగింది. సత్యం, మైటాస్, జగతి పబ్లికేషన్స్‌పై చర్చించాలని ఉభయసభల్లో మహాకూటమి సభ్యులు కోరారు. లోక్‌సభలో దీనిపై చర్చకు మహాకూటమి పట్టుబట్టింది. దీనిపై అకస్మాత్తుగా చర్చ కుదరదని, అయితే మెజారిటీ సభ్యులు అంగీకరిస్తే చర్చకు తాను అనుమతి ఇస్తానని స్పీకర్ సోమనాథ్ చటర్జీ అన్నారు.
రాజ్యసభలో ఈ విషయాన్ని టీడీపీ సభ్యుడు మైసూరారెడ్డి లేవనెత్తారు. దీనిపై తీవ్ర నేరాల దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోందని మూడు నెలల్లో నివేదిక ఇస్తుందని కంపెనీ వ్యవహారాల మంత్రి పిసిగుప్తా సమాధానం ఇచ్చారు. సత్యం వ్యవహారంలో ప్రభుత్వం నిందితులను కాపాడడానికి ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. సత్యం వ్యవహారంపై దర్యాప్తు సంస్థలన్నీ సమన్వయంతో పని చేస్తున్నాయని మంత్రి చెప్పారు. సత్యం కుంభకోణం అత్యంత దురదృష్టకరమైందని, దానిపై దర్యాప్తు సాగుతోందని ఆయన అన్నారు. ప్రైస్ వాటర్ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టే అధికారం రిజర్వ్ బ్యాంక్ కు లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సత్యం కుంభకోణంపై పార్లమెంటరీ ప్యానెల్ విచారణకు ఆదేశించాలని మైసురా రెడ్డి కోరారు.












Click it and Unblock the Notifications