బరిలో పిజెఆర్ కూతురు విజయారెడ్డి
హైదరాబాద్: శేరిలింగంపల్లి శాసనసభా స్థానం నుంచి కాంగ్రెస్ నేత స్వర్గీయ పి. జనార్దన్ రెడ్డి కూతురు విజయారెడ్డి రంగంలోకి దిగుతున్నారు. పిజెఆర్ వ్యతిరేక వర్గానికి చెందిన బిక్షపతి యాదవ్ కు శేరిలింగంపల్లి సీటును ఇవ్వడంతో అసంతృప్తికి గురైన పిజెఆర్ వర్గీయులు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దింపుతున్నారు. ఈ సీటును ఐదుగురు పిజెఆర్ వర్గీయులు ఆశించారు. అయితే వారెవరికీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే, ఇంతలో విజయారెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారని సమాచారం అందుకున్న వారు శేరిలింగపల్లినుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దానికి ఆమె అంగీకరించారు.
నిజానికి విజయారెడ్డి ఖైరతాబాద్ టిక్కెట్ ఆశించారు. అయితే, ఆమెకు కాంగ్రెస్ నాయకత్వం టిక్కెట్ నిరాకరించింది. దాంతో ఆమె ఖైరతాబాద్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలని భావించారు. శేరిలింగంపల్లిలోని మెజారిటీ ప్రజలు పోటీ చేయాలని తనను కోరుతున్నారని, వారి కోరిక మేరకు తాను పోటీకి దిగాలని నిర్ణయించుకున్నానని ఆమె చప్పారు. తన తండ్రి అనుచరుల విజ్ఞప్తి మేరకు తాను పోటీ చేస్తున్నానని ఆమె చెప్పారు. తన తండ్రి చేసిన సేవలు ప్రజలకు గుర్తున్నాయని, అదే తనను తప్పకుండా గెలిపిస్తుందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications