చిరు బుజ్జగింపు: తగ్గని ఆంజనేయరెడ్డి
హైదరాబాద్: అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసిన పార్టీ ఉపాధ్యక్షుడు ఆంజనేయరెడ్డిని బుజ్జగించడానికి ఆ పార్టీ అధినేత చిరంజీవి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆంజనేయ రెడ్డితో చిరంజీవి దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిపినట్లు సమాచారం. టిక్కెట్ల పంపకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆంజనేయ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆంజనేయరెడ్డికి ఇంటికి వెళ్లి తాను మాట్లాడుతానని చిరంజీవి ఆదివారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో చెప్పారు. ఆ మేరకు ఆయన ఆంజనేయరెడ్డితో ఆయన చర్చలు జరిపారు. అయితే ఆంజనేయ రెడ్డి వినలేదని అంటున్నారు.
చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను అన్ని విషయాలను చిరంజీవికి రాసిన లేఖలో వివరించలేదని ఆంజనేయ రెడ్డి చెప్పారు. ప్రజారాజ్యం పార్టీలో అసమ్మతి పెల్లుబుకుతోంది. గుంటూరు జిల్లాలో ఇద్దరు నాయకులు ఆధిపత్యం చలాయిస్తూ అందరినీ విస్మరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మామిడి హరికృష్ణ రెబెల్ గా పోటీకి దిగారు. పార్టీ బలంగా ఉందని చెబుతున్న కోనసీమలోనూ అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. దీంతో చిరంజీవి రంగంలోకి దిగారు. అసమ్మతివాదులకు నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. సామాజిక న్యాయం పాటించడం వల్లనే కొంత మందికి టిక్కెట్లు ఇవ్వలేకపోయామని, దీన్ని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. దీన్ని అర్థం చేసుకుని తన వద్దకు వచ్చేవారిని జీవితాంతం గుర్తుంచుకుంటానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications