వైయస్ జగన్ కు చేదు అనుభవం
కడప: ముఖ్యమంత్రి కుమారుడు, కడప లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోని లింగాల మండలంలో శుక్రవారం రోడ్‌షోలో ఆయనపై మహిళలు ఆగ్రహ వ్యక్తం చేశారు. స్థానిక సమస్యల మీద కొందరు నిలదీశారు. అయిదేళ్ల అధికారంలో తమ సమస్యలు పరిష్కరించలేదని వారు ఎత్తి చూపారు. ఇన్ని రోజులుగా మీ సమస్యలను తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని జగన్ ప్రశ్నించారు. అయిదేళ్లప్పుడు ఓట్లు అడగడానికి వచ్చారు, మళ్లీ ఈ రోజు వచ్చావు. ఈరోజు కాకుంటే ఇంకెప్పుడు అడగాలని వారు ఎదురు ప్రశ్నించారు. మీ సమస్యలేవైనా ఉంటే ఎన్నికల తర్వాత పరిష్కరిస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించాలని ఆయన ఎంతగా ప్రయత్నించినా వారు వినలేదు.
ఎన్నికలు అయిపోతే మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు మీరు కనపడరన్నారు. రోడ్‌షోలో ముందుకు వెళ్తున్న వాహనాన్ని అడ్డుకుని తమ సమస్యకు పరిష్కారం చెప్పాలని నిలదీశారు. స్థానిక నేతలు సర్దిచెప్పడానికి ప్రయత్నించగా వారిని మాట్లాడనీయలేదు. దీంతో కొందరు కార్యకర్తలు దాడికి యత్నించారు. మిద్దెల మీదకు ఎక్కి రాళ్లు కూడా సిద్ధం చేసుకున్నారు. ఫలితంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సకాలంలో స్పందించి ఘర్షణను నివారించారు. ఈ సంఘటనకు అసహనంతో కార్యకర్తల మీద ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.












Click it and Unblock the Notifications