ఆగస్ట్ 15 నుండి కొత్త పెన్షన్ లు.. శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క!
ప్రతినెల పింఛన్ డబ్బుల కోసం ఎదురుచూసే పేదలు ఎంతోమంది ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, డయాలిసిస్ బాధితులు దాదాపు 42 లక్షల మంది చేయూత పింఛన్ల పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రెండు లక్షల పింఛన్లు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కొత్తగా లక్ష పింఛన్లు మంజూరు చేసినట్టు, ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రెండు లక్షల పింఛన్లు ఇస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గతంలోనే వెల్లడించారు. కొత్తగా ఇవ్వబోయే పింఛన్ల కోసం బడ్జెట్లో నిధులను కేటాయించినట్లుగా సీతక్క చెప్పారు.

ఆగస్టు 15వ తేదీ నుంచి ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు
తాజాగా కొత్త పించన్ లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మరో శుభవార్త చెప్పారు మంత్రి సీతక్క. ఆగస్టు 15వ తేదీ నుంచి ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్టు గా మంత్రి సీతక్క ప్రకటించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.
ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పింఛన్ల పంపిణీ
పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణించినట్లయితే వారి పేర్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎవరైనా అర్హులై ఉండి కూడా పింఛన్ రాకపోతే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పింఛన్ల పంపిణీ చేయాలని సీతక్క పేర్కొన్నారు.
అనర్హులు పెన్షన్ తీసుకుంటే పేదలకు అన్యాయం చేసినట్టే
అనర్హులు పెన్షన్ తీసుకుంటే పేదవారికి అన్యాయం చేసినట్లు అవుతుందని పేర్కొన్న సీతక్క, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లు చేరేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిరుపేదల కోసం అందిస్తున్న ఈ పెన్షన్ పథకం వారికి మాత్రమే లబ్ధిని చేకూరిస్తే బాగుంటుందని సీతక్క అభిప్రాయం వ్యక్తం చేశారు.
పించన్ తీసుకుంటున్న వారి లబ్ధిని నిర్ధారించడానికి లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ
ఇదిలా ఉంటే ప్రస్తుతం పింఛన్ తీసుకుంటున్న వారి లబ్ధిని నిర్ధారించడానికి లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ముమ్మరంగా చేస్తున్నారు. ఈ ప్రక్రియను ఈ నెల తో పూర్తి చేసుకొని వచ్చే నెల నుండి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో పింఛన్ డబ్బులు జమ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది . ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అక్రమాలకు చెప్పడమే కాకుండా లబ్ధిదారులకు కూడా సమయం వృధా కాకుండా ఉంటుందని సమాచారం.













Click it and Unblock the Notifications