బంగాళాఖాతంలో అల్పపీడనం- నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు
నైరుతి రుతుపవనాల సందడి మందగించిన ప్రస్తుత పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భారీ ఉపశమనాన్ని కలిగిస్తోంది. దీనివల్ల ఏపీలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. బలమైన ఈదురుగాలులు, పిడుగులతో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదు కావొచ్చు. నైరుతి రుతుపవనాలు మందగించినప్పటికీ ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఒకింత వర్షాలకు పెద్దగా లోటు ఉండట్లేదు.
ఇవే పరిస్థితులు నేడు కూడా కొనసాగనున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం, దీనితో పాటు ఉన్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రత్యేకించి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని పేర్కొంది.

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోస్తా తీరంలోని కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రాయలసీమలోని అనంతపురం జిల్లాల్లో ఇదే తరహా వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులకు అవకాశం ఉందని చెప్పారు.
అలాగే బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు,జిల్లాల్లో మేఘవృతమైన వాతావరణం చెదురుమదురుగా పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఈదురుగాలులు వీస్తున్నప్పుడు గానీ, పిడుగులు పడుతున్నప్పుడు గానీ శిథిల నివాసాలు, గోడలు, చెట్లు, హోర్డింగుల కింద తలదాచుకోవద్దని ఎస్డీఎంఏ పేర్కొంది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలు, శ్రామికులు, పశుకాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రఖర జైన్ అన్నారు.












Click it and Unblock the Notifications