ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
న్యూఢిల్లీ: తుదివిడత పోలింగ్‌లో తొలిగంటలోనే బుధవారం పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నైలో డిఎంకే అధినేత కరుణానిధి, ఏఆర్ రెహమాన్, సూపర్‌స్టార్ రజనీకాంత్, అన్నాడియంకె నేత జయలలిత తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శివగంగలో కేంద్ర మంత్రి చిదంబరం ఓటు వేశారు. కోల్‌కతాలో గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సోమనాథ్ చటర్జీ, బృందాకారత్‌లు తొలిగంటలోనే ఓటు వేశారు.
ప్రజలు యుపిఎ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఓటేస్తారని చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. కరుణానిధి వీల్ చైర్ లో పోలింగ్ స్టేషన్ కు చేరుకున్నారు. సిపిఎం తనను వెలేసిందని, ఇప్పుడేం చేస్తారో చూద్దామని కోల్ కత్తాలో ఓటేసిన సోమనాథ్ ఛటర్జీ అన్నారు. సిపిఎంకు గతంలో కన్నా తక్కువ సీట్లు రావచ్చునని, అయితే వామపక్షాలు లేకుండా కేంద్రంలో ఏదీ సాధ్యం కాదని ఆయన అన్నారు.
తాను కేంద్రంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకే ఓటేశానని సినీ నటుడు రజనీకాంత్ చెన్నైలో అన్నారు. రాంపూర్ ఎస్పీ అభ్యర్థి జయప్రద తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జయప్రదను గెలిపించి రాంపూర్ ప్రజలు మరోసారి తప్పు చేయరని రాంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి నూర్ బానో అన్నారు. రాజకీయాలకు, క్రికెట్ కు చాలా తేడా ఉందని మురాదాబాద్ కాంగ్రెసు అభ్యర్థి అజహరుద్దీన్ అన్నారు. ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications