హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ముంచిండు: కెసిఆర్

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: లోక్‌సభ, అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం మోసం చేయడం వల్లే తమ పార్టీఅభ్యర్థులు ఓటమి చెందారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆరోపించారు. ఆ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదన్నారు. మహాకూటమిలో చేరడం తమకు నష్టం జరిగిందని, ఆశించిన ప్రయోజనం లభించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. కూటమి పార్టీల మధ్య ఓటు బదిలీ జరగలేదని ఆయన విమర్శించారు. తెరాస అత్యాశకు పోయి అధిక స్థానాలు తీసుకుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు తప్పన్నారు. వామపక్షాలే అత్యాశకు వెళ్లాయని, వారు తీసుకున్న స్థానాలకు, గెలిచిన స్థానాలకు మధ్య తేడా చూసుకోవాలని ఆయన అన్నారు.

తెరాసకు వచ్చిన ఓట్లను రాష్ట్రం మొత్తమ్మీద కాకుండా తెలంగాణ ప్రాంతం వరకే చూడాలని కేసీఆర్‌ తెలిపారు. ఓట్ల శాతంపై మీడియాలో వస్తున్న కథనాలు, వ్యాఖ్యలు వాస్తవం కాదని ఆయన అన్నారు. తెరాస కేవలం తెలంగాణలోనే పోటీచేసిందని, కోస్తా, రాయలసీమల్లో పోటీచేయలేదని చెప్పారు. 'తెలంగాణలో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 33 శాతమైతే మహాకూటమికి 38 శాతం ఓట్లు వచ్చాయి. తెరాస పోటీచేసిన తొమ్మిది లోక్‌ సభ స్థానాల్లో 31 శాతం ఓట్లు సాధించిందని ఆయన అన్నారు. కూటమిలో తెరాస 45 స్థానాలు తీసుకున్నప్పటికీ వీటిలో మహేశ్వరంలో చివరి నిమిషంలో తెదేపా కోరికతో అభ్యర్థిని విరమించుకున్నామని కేసీఆర్‌ చెప్పారు. పాతబస్తీలో గెలవబోమని తెలిసినా రెండు స్థానాలు తీసుకోవలసి వచ్చిందని, పెద్దపల్లి, రామగుండం, మక్తల్‌ తదితర ఆరు నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్థులను నిలిపి తెరాసను వెన్నుపోటు పొడిచిందని వరంగల్‌ లోక్‌ సభ స్థానంలో టిడీపి అభ్యర్థిని నిలపడంతో అక్కడ లక్షకుపైగా ఓట్లు చీల్చారని ఆయన అన్నారు. సికింద్రాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి అని, నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో తెదేపా అసెంబ్లీ అభ్యర్థులందరూ విజయం సాధించినా తెరాస లోక్‌సభ అభ్యర్థి పరాజయం పాలయ్యారని, చివరకు నేను పోటీచేసిన మహబూబ్‌నగర్‌లో కూడా తెదేపా శ్రేణులు ఏమాత్రం సహకరించలేదని ఆయన అన్నారు. సహకరించొద్దని హైదరాబాద్‌ నుంచే వారికి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసిందని, జడ్చర్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎర్రశేఖర్‌ ఘనవిజయం సాధిస్తే అక్కడ తెరాస లోక్‌సభ అభ్యర్థికి వెయ్యి ఓట్లు కూడా ఆధిక్యం రాలేదని, తెరాస అసెంబ్లీ అభ్యర్థులు మాత్రం తెలుగుదేశం పార్టీకి పూర్తిస్థాయిలో సహకరించారని తెలిపారు.

తెరాస శాసనసభాపక్ష నేతగా ఈటెల రాజేందర్‌ను మరోసారి ఎన్నికయ్యారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఎమ్మెల్యేల భేటీలో ఈటెలను కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. శాసనసభాపక్ష ఉప నేతగా టి.హరీశ్‌రావు, పార్టీవిప్‌గా కొప్పుల ఈశ్వర్‌, శాసనసభాపక్ష కార్యదర్శిగా ఏనుగు రవీందర్‌లను ఎన్నుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X