ఇప్పుడు అందరివాడిని: స్పీకర్
హైదరాబాద్: విపక్షాలు తనపై చేసిన విమర్శలపై స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. స్పీకర్ గా బాధ్యతలు చేపట్టకుముందే తనపై విమర్శలు చేయడాన్ని విపక్షాల విజ్ఞతకే వదిలివేస్తున్నాని అన్నారు. స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శాసనసభ కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను గతంలో పోషించిన చీఫ్ విప్ పాత్రకు ఇప్పటి స్పీకర్ పాత్రకు తేడా ఉందని అన్నారు.
ఈ సారి సభలో మహిళా సభ్యులకు ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తామన్నారు. అసెంబ్లీ నిబంధనలకు అనుగుణంగా ఎక్కువ మందికి అవకాశం కల్పించడానికి ప్రయత్నిస్తానన్నారు. అంతకు ముందు పదమూడో శాసనసభకు స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కిరణ్ కుమార్ రెడ్డి సభలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని తెలిపారు. స్పీకర్ గా ఎన్నికైన తర్వాత ఆయన సభనుద్దేశించి ప్రసంగించారు. స్పీకర్ గా తాను అన్ని రాజకీయ పక్షాలకు చెందినవాడినని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి అన్ని పక్షాల సహకారంతో సభను హుందాగా నడపడానికి ప్రయత్నిస్తానన్నారు.












Click it and Unblock the Notifications