కైరో: ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచం మొత్తం ఏకం కావాలని గురువారం నాడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. ఈజిప్టు పర్యటనలో ఉన్న ఒబామా కైరో విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ ఇస్లాం ప్రపంచంతో కొత్త సంబంధాలు కలుపుకోవడానికి తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. అమెరికా, ఇస్లాం భిన్న ధ్రువాలు కావని, ఇస్లాం కూడా అమెరికాలో ఓ భాగమనేనని ఆయన అన్నారు. తాము ఇస్లాంపై పోరాటం జరపడం లేదని, కేవలం ఉగ్రవాదులతోనే పోరాడుతున్నామని గుర్తించాలని మధ్యప్రాచర్య దేశాలను కోరారు. తన తండ్రి కూడా ఇస్లాంను అనుసరించిన వ్యక్తి కావడం తాను గర్విస్తున్న విషయమని చెప్పారు. తాలిబన్లు, లష్కరే తీవ్రవాదులపై తాము ఉద్దేశ పూర్వకంగా దాడి చేయడం లేదని, ప్రపంచంలో ఘర్షణాత్మక వాతావరణాన్ని తగ్గించానికే ఈ కృషి చేస్తున్నామని చెప్పారు. ఇరాక్ లో సైన్యాన్ని 2012లోపు ఉప సంహరిస్తామని, ఆఫ్ఘన్ లో కూడా శాశ్వతంగా తమ సైన్యాన్ని ఉంచే ఉద్దేశం లేదని వివరించారు. ఆఫ్ఘన్ పునర్నిర్మాణానికి 86 బిలియన్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆఫ్ఘన్, పాక్‌లలో సైనిక చర్య ద్వారా ఉగ్రవాదాన్ని అణిచివేయవచ్చన్నది ఒట్టి భ్రమేనని ఒబామా అభిప్రాయపడ్డారు.