ఆ పదం తీసేయండి: తెరాస
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంలోని వేర్పాటువాదం అనే పదాన్ని తొలగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఆయన బుధవారం పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమాన్ని వేర్పాటువాద ఉద్యమంగా పేర్కొనడం అవమానించడమేనని ఆయన అన్నారు. దేశంలో కొత్తగా 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయని, అవేవీ ముళ్లకంచెలు వేసుకోలేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమం ముళ్లకంచెలు వేసుకోవడానికి కాదని ఆయన అన్నారు. ప్రపంచ బ్యాంక్ కూడా భారత్ వంటి దేశాల్లో చిన్న రాష్ట్రాలు ఉండాలని అంటూ పంజాబ్ హర్యానా రాష్ట్రాల ఏర్పాటును అహ్వానించిందని, ప్రపంచ బ్యాంక్ విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెసు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇస్తామని కాంగ్రెసును మోసం చేసిందని ఆయన విమర్శించారు. తమ పార్టీని కుట్ర పూరితంగా చీల్చే ప్రయత్నం చేసిందని, కొంత మంది శాసనసభ్యులతో తిరుగుబాటు చేయించిందని ఆయన విమర్శించారు. తమ వేలితోనే తమ కంట్లో పొడిచే ప్రయత్నం కాంగ్రెసు చేసిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటామని చెప్పామని, అది అవకాశవాదం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications