హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ దే ప్రాంతీయ తత్వం: కెసిఆర్

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: శాసనసభలో మాట్లాడిన తీరు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుసంస్కారానికి నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వైయస్ వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. 'వాడు.. వీడు' అని సంబోధించడం పార్లమెంటరీ సంప్రదాయం కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నీచానికి దిగజారి మాట్లాడారని ఆయన బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి శాసనసభలో తెలంగాణ ఉద్యమం, తెరాస గురించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వైఎస్‌ నిజస్వరూపం మరోసారి బయటపడిందన్నారు.

"2004లో కాంగ్రెస్‌ తెరాసతో ఎందుకు పొత్తుపెట్టుకుంది? వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రతిపక్షంలో కూర్చున్న నాడు ప్రత్యేక తెలంగాణ తీర్మానం కోసం ఎందుకు పట్టుపట్టారు. సోనియా గాంధీ వద్దకు తెలంగాణ ఏర్పాటు కోసం ఎందుకు ప్రతినిధులను పంపించారు? 2004 ఎన్నికల అనంతరం రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చారు కదా! సోనియా గాంధీ కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పారు కదా! అయినా, మీరు తెలంగాణ ఇవ్వలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రజల గుండె గాయమయ్యేలా మాట్లాడుతారా? ముఖ్యమంత్రి కుసంస్కారానికి ఇది నిదర్శనం. విశ్వసనీయత గురించి మాట్లాడుతున్న ఆయనలోని విశ్వసనీయత ఎక్కడికిపోయింది?" అని నిలదీశారు.

కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఎన్నికల సందర్భంగా ఓట్లు దండుకోవడానికే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలను ఉపయోగించుకుంటోందని విమర్శించారు. తెలంగాణకు నిధులు, నీళ్లలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించినందుకు నిలదీసినందుకు ముఖ్యమంత్రి దురహంకారపూరితంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపులో వారి గొప్పతనమేమీలేదన్నారు. కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటు చీలిపోవడంతోనే గెలిచారన్నారు. కేవలం 30-31శాతం ఓట్లతోనే అధికార పీఠం దక్కిందన్న విషయాన్ని మరువరాదన్నారు.

తెలంగాణలో ఎన్నికలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని, నంద్యాలలో జరిగిన సభలో తెలంగాణ ఏర్పడితే మనం విదేశీయుల్లా ఉండాలంటూ ఆయన మాట్లాడడం దారుణమన్నారు. 'మనం' అంటే ఎవరో చెప్పాలని, ఇలా అనడం ముఖ్యమంత్రి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు జీవన విధ్వంసాన్ని ఇంకెన్నాళ్లు భరించాలన్నారు. కమిటీలు వేస్తూ చెబుతున్న కట్టుకథలు, పిట్టకథలను ఇంకెన్ని రోజులు నమ్మాలన్నారు. సమయం, సందర్భం వచ్చినపుడు తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెబుతారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X