హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యం పొమ్మనలేదు, పొగ పెట్టింది

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సత్యం కంప్యూటర్స్‌లో అదనపు సిబ్బంది తొలగింపునకు రంగం సిద్ధమైందనే వదంతులకు చెక్‌ పెడుతూ కొత్త యాజమాన్యం టెక్‌ మహీంద్రా ఉద్యోగులను తొలగించబోమని స్పష్టం చేసింది. అయితే, పెద్ద సంఖ్యలో సిబ్బందిని పక్కకు కూర్చోబెట్టి, నామమాత్రపు జీతం ఇచ్చే ఒక ప్రణాళికను టెక్‌ మహీంద్రా ప్రకటించింది. ఐటి సంస్థలకు ఉద్యోగులే అమూల్యమైన ఆస్తులని, వీరిని తొలగించడానికి బదులు అవసరమైనప్పుడు సేవలను వినియోగించుకునేలా సరికొత్త వ్యూహానికి రూపకల్పన చేసినట్లు టెక్‌ మహీంద్రా సిఇఒ వినీత్‌ నాయర్‌ తెలిపారు. ఈ విధానంలో భాగంగా సత్యం కంప్యూటర్స్‌లో అదనంగా ఉన్నట్లుగా చెబుతున్న 10,000 మంది ఉద్యోగులను ప్రత్యేక బృందంగా(వర్చువల్‌ పూల్‌) ఏర్పాటు చేస్తారు.

పని లేకపోయినా మూలవేతనం, పిఎఫ్‌, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ను చెల్లిస్తారు. భవిష్యత్తులో వీరి సేవలు అవసరమైన పక్షంలో తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఒకవేళ ఎవరికైనా ఇతర సంస్థలో ఉద్యోగం వస్తే వెళ్లిపోవచ్చని, అలా వెళ్లకుండా ప్రత్యేక బృందంలో మిగిలిపోయిన వారు మాత్రమే టాలెంట్‌పూల్‌గా కంపెనీకి ఉపయోగపడతారని నాయర్‌ వివరించారు. కంపెనీకి అవసరమైనప్పుడు వీరిని ఉద్యోగంలోకి తిరిగి తీసుకుంటుంది. లేదంటే ఉద్యోగుల ఖర్చులకు సరిపడా మూలవేతనం మాత్రమే చెల్లిస్తుంది. మిగులు ఉద్యోగుల సమస్య కేవలం సత్యం కంప్యూటర్స్‌ మాత్రమే ఎదుర్కొనడం లేదని, ఈ సమస్య ఐటి పరిశ్రమలో అంతటా కనపడుతోందని నాయర్‌ వ్యాఖ్యానించారు.

ఉద్యోగుల శిక్షణ నిమిత్తం కోట్లాది రూపాయలు వెచ్చించామని, వీరిని వదులుకోలేకనే ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు ఆయన వివరించారు. వర్చువల్‌ పూల్‌ అంటూ సత్యం కంప్యూటర్స్‌ కొత్త పల్లవి అందుకున్నప్పటికీ ఉద్యోగుల పాలిట దీనిని త్రిశంకు స్వర్గంలా పేర్కొనవచ్చు. ఉద్యోగ భద్రత లేకుండా కేవలం మూలవేతనం మాత్రమే అందుకుంటూ ఉండటం ఉద్యోగులకు కష్టసాధ్యమే. అందుకే ఈ ఉద్యోగులంతా ఇతర సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించి అవకాశం రాగానే వెళ్లిపోతారని నిపుణులు అంటున్నారు. ఒకవిధంగా పొమ్మన లేకుండా పొగబెట్టే విధానాన్ని టెక్‌ మహీంద్రా అనుసరిస్తోందని, ఉద్యోగుల తొలగింపు విధానానికి ప్రభుత్వం విముఖంగా ఉండటంతో ఈ వ్యూహాన్ని రచించి ఉండొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే, వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగానే ఈ విధానాన్ని ఆవిష్కరించినట్లు సత్యం సిఇఒ ఎఎస్‌ మూర్తి పేర్కొన్నారు. మిగులు సిబ్బంది సమస్యతో సతమతమయ్యే ఐటి కంపెనీలకు ఇదెంతగానో ఉపయోగపడుతుందని, మానవతా దృక్పథంతో వ్యవహరించడం వల్ల జాబ్‌ మార్కెట్‌ దెబ్బతినదని అంటున్నారు. నాలుగు నుంచి ఆరు నెలల కాల పరిమితితో అమలు చేసే ఈ విధానం వల్ల సిబ్బంది వ్యయం 60 శాతం వరకూ తగ్గుతుందని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X