కెసిఅర్! ముక్కు నేలకు రాసి సారీ చెప్పు'
హైదరాబాదు: తెలంగాణ రాష్ట్రసమితి ప్రధానకార్యదర్శి, వరంగల్ మాజీ ఎంపి రవీంద్ర నాయక్ పై ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేసి కొట్టారు. పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశానికి హాజరైయ్యేందుకు తెలంగాణ భవన్ కు వచ్చిన నాయక్ పై కార్యకర్తలు దాడి చేసి కొట్టి గెంటివేశారు. పిడిగుద్దులు గుద్దారు. చొక్కా కూడా చింపివేశారు.
దాంతో తీవ్రమనస్తాపానికి గురైన రవీంద్ర నాయక్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుపై ధ్వజమెత్తారు. విలేకరుల ముందు కెసిఅర్పై నిప్పలు చెరిగారు. రాయటానికి వీలుకాని విధంగా దుర్భాషలాడారు. తనను రౌడీలతో కొట్టించిన కెసిఅర్ సర్వనాశనమవుతారని శాపం పెట్టారు. తనను కొట్టించిన కెసిఅర్పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టనని, తెలంగాణ ప్రజల స్టేషన్ లో కేసు బుక్ చేస్తున్నానని అన్నారు. కెసిఅర్ ను రాళ్లతో కొట్టాలని తెలంగాణ ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు. సమావేశాలకు ఆహ్వానించి కొట్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తనని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏజంట్ అని నిరూపిస్తే, తెలంగాణ భవన్ ముందు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటానన్నారు.
ఇంతకాలం కెసిఅర్ లాంటి నాయకునితో కలసి ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని కోరారు. ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.












Click it and Unblock the Notifications