జడ్జిపై ఒత్తిడి తెచ్చింది రాజా: అన్నాడియంకె
న్యూఢిల్లీ: మార్కు షీట్ల ఫోర్జరీ కేసులో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి రఘుపతిపై ఒత్తిడి తెచ్చిన కేంద్ర మంత్రి డిఎంకెకు చెందిన ఎ.రాజా అని అన్నాడియంకె గురువారం ఆరోపించింది. దీంతో ఈ వ్యవహారం సంచలమైన మలుపు తీసుకుంది. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఐటి, టెలీకమ్యూనికేషన్ల మంత్రి రాజా ఈ వివాదంలో చిక్కుకోవడం తమిళనాడు పాలక పార్టీ డిఎంకెను చిక్కుల్లోకి నెట్టింది. రాజాను కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించి, ఆ వ్యవహారంపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని అన్నాడియంకె నేత జయలలిత డిమాండ్ చేశారు.
అయితే ఈ వ్యవహారంపై కాంగ్రెసు పార్టీ మౌనం వహిస్తోంది. జస్టిస్ రఘుపతి ఆ కేంద్ర మంత్రి పేరు చెప్తే లేదా మంత్రి పేరును తెలియజేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తే అప్పుడు చూడవచ్చునని కాంగ్రెస్ భావిస్తోంది. జస్టిస్ రఘుపతి పేరు వెల్లడించడం లేదు. ఆ వ్యవహారంపై న్యాయవాది బేషరతు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కోర్టు ధిక్కరణ కింద కేంద్ర మంత్రిపై చర్యలు తీసుకోవాలని భారత బార్ కౌన్సిల్ డిమాండ్ చేస్తోంది.
తనపై వచ్చిన ఆరోపణలను రాజా ఖండిస్తున్నారు. తన జిల్లాకు చెందినవారే కావడం వల్ల మార్కు షీట్ల కుంభకోణం కేసు నిందితులు డాక్టర్ కృష్ణమూర్తి, అతని కుమారుడు కిరుబా శ్రీధర్ మంత్రికి తెలుసునని మంత్రి సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారమంతా పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
మార్కు షీట్ల కుంభకోణాన్ని తొలుత వెలుగులోకి తెచ్చిన వ్యక్తి మరణించినట్లు ఒక ప్రముఖ దినపత్రిక రాసింది. 31 ఏళ్ల ఆ వ్యక్తి నిరుడు మే 20వ తేదీన మరణించినట్లు తెలిపింది. పాండిచ్చేరి విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలో పని చేస్తున్న జయరాం అనే ఆ వ్యక్తి శవం తన వ్యవసాయ క్షేత్రంలో ఉరికి వేలాడుతూ కనిపించిందని ఆ పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications