ఇద్దరి నుంచి విముక్తి చేయండి: హరీష్
హైదరాబాద్: తెలంగాణపై రెఫరెండం నిర్వహించి, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుల నుంచి తమకు విముక్తి కలిగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. వైయస్, చంద్రబాబుల సవాళ్లు, ప్రతిసవాళ్లపై ఆయన సోమవారం శాసనసభలో ప్రతిస్పందించారు. ఇద్దరు తమ వ్యక్తిగత విషయాలపై రెఫరెండం నిర్వహించుకోవడానికి బదులు తెలంగాణపై రెఫరెండం నిర్వహించాలని ఆయన అన్నారు. తెలంగాణ కావాలా, వద్దా అని ఈ ప్రాంత ప్రజల అభిప్రాయం తెలుసుకుని ఈ ఇద్దరు నాయకుల నుంచి విముక్తి కలిగించాలని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించాలని ఆయన అన్నారు.
వైయస్, చంద్రబాబుల సవాళ్లు, ప్రతిసవాళ్లపై లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ తీవ్రంగా ప్రతిస్పందించారు. అసెంబ్లీ వ్యవహారం ఆ ఇద్దరు నాయకుల సొంత వ్యవహారమా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం వారి సొంత జాగీరా అని ఆయన అడిగారు. రెఫరెండానికి రాజ్యాంగం అంగీకరించదని ఆయన అన్నారు. బిజెపి శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి వారిద్దరి తీరును వ్యతిరేకించారు.












Click it and Unblock the Notifications