ముంబై: అంబానీ సోదరుల మధ్య గ్యాస్ మంట రేపుతోంది. తన సోదరుడు ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)పై, పెట్రోలియం శాఖపై అనిల్ అంబానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటాదారుల సమావేశంలో ఆయన మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎన్ఆర్ఎల్కు గ్యాస్ సరఫరా చేసే విషయంలో తమతో ఉన్న చట్టపరమైన కాంట్రాక్టును ఉల్లంఘించేందుకు ఆర్ఐఎల్ ఎన్నో ఎత్తులు జిత్తులు చేసిందని ఆయన విమర్శించారు.ఆర్ఐఎల్ ప్రవర్తన వల్ల తమతో పాటు ఎన్టీపిసికి కూడా నష్టం వాటిల్లుతోందని ఆయన ఆయన అన్నారు. ఆర్ఐఎల్ తో వివాదం వల్ల మదుపు దారులు ఆందోళనకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఈ వివాదంలో పెట్రోలియం శాఖ పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. గ్యాస్ ద్వారా వచ్చే లాభాల్లో 99 శాతం ఆర్ఐఎల్ అనుభవిస్తుండగా ఒక శాతం మాత్రమే ప్రభుత్వానికి వస్తోందని ఆయన అన్నారు.
ఆర్ఐఎల్ ఉత్పత్తి చేస్తున్న కెజి బేసిన్ గ్యాస్ పై తాము యాజమాన్య హక్కులను కోరుకోవడం లేదని ఆయన చెప్పారు. న్యాయబద్దంగా తమకు రావాల్సిందే అడుగుతున్నామని ఆయన చెప్పారు.బొంబాయి హైకోర్టు తీర్పు ఆర్ఐఎల్ కు శరాఘాతంగా మారిందని, ఈ సమయంలో ఆర్ఐఎల్ ఆదుకోవడానికి జాతీయ సంపద పేరుతో పెట్రోలియం శాఖ ముందుకు వచ్చిందని ఆయన అన్నారు. మూడేళ్లుగా ఆర్ఐఎల్ నమ్మకద్రోహానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు.