విపత్తుకు వైయస్ కూడా బాధ్యుడే: కెసిఆర్

శ్రీశైలం ప్రాజెక్టును పూర్తిగా జల విద్యుదుత్పత్తికి మాత్రమే నిర్మించారని, అయితే దాన్ని సాగునీటి ప్రాజెక్టుగా మార్చారని, శ్రీశైలం నుంచి రాయలసీమలో వివిధ ప్రాజెక్టులను అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులకు నీరు తరలిస్తున్నారని ఆయన అన్నారు. మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చెన్నైకి మంచినీటి సరఫరాకు 15 టిఎంసిని కేటాయించాయని, ఆ నీటిని చెన్నైకి తరలించడానికి తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టారని, అయితే తెలుగు గంగపై ఏ విధమైన అనుమతులు లేకుండా, రాజ్యాంగ విరుద్ధంగా, జల సంఘం అనుమతులు లేకుండా పలు ప్రాజెక్టులను చేపట్టారని, వందకు టిఎంసిలకు పైగా నీటిని తరలించడానికి ఈ అక్రమ ప్రాజెక్టులను నిర్మించారని ఆయన చెప్పారు. గోరుకల్లు, అవుకు, చిత్రావతి, గండికోట వంటి ప్రాజెక్టులను అక్రమంగా నిర్మించారని, పోతులూరి వీరబహ్మం గారి రిజర్వాయర్, సోమశిల, గాలేరు - నగరి ప్రాజెక్టులను అక్రమంగా నిర్మించారని ఆయన ఆరోపించారు. కుందూ కాలువ ద్వారా అక్రమంగా 10 టిఎంసిల నీటిని తరలిస్తున్నారని ఆయన చెప్పారు. హంద్రీనీవా, వెలిగోడు ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు.
తెలుగు గంగ, ఎస్కెఎస్ చానెల్, శ్రీశైలం కుడి గట్టు కాలువ ప్రాజెక్టుల ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తూ అక్రమంగా ప్రాజెక్టులను నింపే ప్రయత్నం చేస్తున్నారని, కుడి గట్టు కాలువకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 34 టిఎంసిల నీటి కేటాయింపు మాత్రమే ఉండగా 345 టిఎంసిల నీటిని తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్రమ ప్రాజెక్టులపై తాను పలు మార్లు ప్రధానికి ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. కె. విద్యాసాగరరావు వంటి జల నిపుణులు మొత్తుకున్నా రాష్ట్ర ప్రభుత్వాలు వినలేదని ఆయన విమర్శించారు. అక్రమ ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తే తమ శాసనసభ్యులు కొట్టారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications